Tuesday 11 August 2015

టీడీపీ గవర్నర్ గయాబ్ !

తెలుగుదేశం పార్టీ గవర్నర్ సారీ ..సారీ ..ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంపిక చేసిన గవర్నర్, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దళితుడు అయిన మోత్కుపల్లి నర్సింహులు ఈ మధ్య కనిపించడం లేదు. ఓటుకునోటు కేసులో చంద్రబాబును బానే వెనకేసుకు వచ్చిన మోత్కుపల్లి ఆ తరువాత మీడియా ముందు గానీ వెనకగాని కనిపించడం లేదు. ఆయన పార్టీని వీడుతున్నాడంటూ ఆ మధ్య పార్టీ నుండే పుకార్లు లేపారని, ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నాడని ఆంధ్రా మీడియా ద్వారా వ్యూహాత్మకంగా వార్తలు ప్రసారం చేయించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎవ్వరినయినా వాడుకుని వదిలేసే అలవాటున్న ఆంధ్రా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో మోత్కుపల్లిని వీలయినంత ఎక్కువగా వాడుకున్నాడు. గత ఎన్నికల ముందు రాజ్యసభ సభ్యుడుగా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా తెలంగాణ కోటాలో ఆంధ్రాకు చెందిన రామ్మోహన్ రావుకు ఇచ్చారు. ఆ తరువాత మోత్కుపల్లి నర్సింహులు బుజ్జగించి ఆయనకు ఏ మాత్రం పట్టులేని మధిర ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు. ఓడిపోయినా రాజ్యసభ ఖాయం అని నమ్మించారు.
త్వరలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ఎమ్మెల్యేల నుండి తెలంగాణకు చెందిన మోత్కుపల్లిని ఎంపీని చేసే ఇష్టంలేని బాబు అండ్ కో మెల్లిగా మోత్కుపల్లి గవర్నర్ అవుతున్నాడంటూ తన అనుకూల ఆంధ్రా మీడియాతో ప్రచారం మొదలు పెట్టించాడు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే రేపో ..మాపో కేంద్రం మోత్కుపల్లిని గవర్నర్ గా ప్రకటిస్తుంది అన్నట్లు కథనాలు వండి వార్చాడు. ఆ కథ ఎటూ తేలడం లేదు. దీంతో ఇక లాభం లేదని మోత్కుపల్లి పార్టీ మారుతున్నాడని కథ మొదలెట్టారు. దీంతో బాబు పన్నాగం గమనించిన మోత్కుపల్లి సడన్ గా సైలెంట్ అయిపోయాడు.
తాను ఇప్పుడు ఏం చేసినా దానిని సాకుగా చూపి చంద్రబాబు రాజ్యసభ కోటా నుండి తనను తప్పిస్తాడని, రేపు టీడీపీ నుండి రాజ్యసభకు ఎంపిక చేసే పేర్లలో తన పేరు లేకుంటే అప్పుడు బాబు భరతం పట్టాలని తెరవెనక ప్రిపరేషన్స్ లో ఉన్నాడని తెలుస్తోంది. అందుకే ఓటుకునోటు ఉదంతం అప్పటి నుండి అడపాదడపా బయటకు వచ్చిన మోత్కుపల్లి ఆ తరువాత చంద్రబాబుకు సంబంధించిన కీలక విషయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. గత నెలరోజులుగా మోత్కుపల్లి అసలు మీడియా ముందుకే రాలేదు. మరి బాబు మాయోపాయాలను ఎదుర్కొని ఆంధ్రా కోటా నుండి మోత్కుపల్లి ఎంపీ అవుతాడా ? లేక బాబు చేతిలో బలయిన వారి ఖాతాలో మోత్కుపల్లి చేరతాడా ? వేచిచూడాలి

No comments:

Post a Comment