Thursday 13 August 2015

తెలంగాణ బాధ ఇప్ప‌టికైనా అర్ధ‌మైందా...

ప్ర‌త్యేక‌హోదా కోసం మునికోటి అనే వ్య‌క్తి తిరుప‌తిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఎంత బాధాక‌ర‌మైన విష‌యం... తను, త‌న‌పై ఆధార‌ప‌డ్డ కుటుంబం, త‌న‌కోసం ఆరాట‌ప‌డే బంధువులు, మిత్రులూ వీరెవ్వ‌రూ ఆ క్ష‌ణంలో ఆయ‌న‌కు గుర్తురాలేదు. తన ప్రాంతం కోసం, ఆ ప్ర‌జ‌ల సంతోషం కోసం త‌న ప్రాణం పోయినా ఫ‌ర్వాలేద‌నుకున్నాడు. ఎంత గొప్ప త్యాగం. దీనిపై అక్క‌డా ఇక్క‌డా అని కాదు తెలుగు ప్రాంతాలు రెండూ విషాదం వ్య‌క్తం చేశాయి. 
 
కాక‌పోతే... ఈ మునికోటి ఆత్మ‌హ‌త్యతోనైనా బాధ వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రాంత‌ రాజ‌కీయ నాయ‌కులు, వివిధ సంఘాల నేత‌లు ఇప్ప‌టికైనా తెలంగాణ త్యాగ‌ధ‌నుల గొప్ప‌త‌నాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ కోసం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వారి గురించి ఆంధ్రా నేత‌లు కొంద‌రు కించ‌ప‌రుస్తూ మాట్లాడిన సంద‌ర్భాలు చూశాం. అంతెందుకు ఒకవర్గం మీడియా సైతం ఆ త్యాగ‌ధ‌నుల త్యాగాల‌ను అవ‌మానించేలా వివిధ ర‌కాల క‌థ‌నాలు కూడా ఇచ్చింది. వారంద‌రూ ఇప్పుటికైనా తాము చేసిన త‌ప్పు స్వ‌యంగా ఒప్పుకొని ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాల్సిన త‌రుణం ఇదే. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో అసువులు బాసిన త్యాగ‌ధ‌నుల‌పై తాము చేసిన అవ‌మాన కామెంట్ల‌పై ఒక్క‌క్ష‌ణం ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేసినా వారి ఆత్మ శాంతించిన‌ట్లే.
మునికోటి ఆత్మ‌హ‌త్య‌తో నైనా ఉద్య‌మం కోసం బ‌లి అర్పించుకునే వారి బాధ ఏంటో, వారి ఆకాంక్ష ఎంత బ‌ల‌మైందో ఆంధ్రా ప్రాంత నాయ‌కుల‌కు తెలిసిరావాలి. అంటే... రాష్ట్రాన్ని విభ‌జించ‌డం త‌ప్ప‌నో, ప్ర‌త్యేక తెలంగాణ ఇవ్వ‌డం త‌ప్ప‌నో కామెంట్లు చేయ‌డం ఇక‌నైనా మానుకోవాలి. ఎంద‌రో త్యాగ‌ధ‌నుల పోరాటానికి ఫ‌లితం తెలంగాణ‌! విభ‌జ‌న చేయ‌డం త‌ప్ప‌ని మాట్లాడుతున్న‌ స‌ద‌రు నేత‌లు దీన్ని గౌర‌వించ‌డం నేర్చుకోవాలి.
ఏదేమైనా ఆత్మ‌హ‌త్య‌లు స‌మ‌ర్ధ‌నీయం కాదు. ఏదో కావాల‌న్న ఆకాంక్ష‌తో ఆత్మ‌హ‌త్యలు చేసుకుందామ‌నుకుంటున్న వారు గుర్తించాల్సిన విష‌యం ఏమిటంటే... ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే మీ ఆకాంక్ష సాకార‌మ‌య్యే అద్భుత క్ష‌ణాల్ని చూసే అవ‌కాశాన్ని కోల్పోతారు. ఆ ఫ‌లితాన్ని అనుభ‌వించి ఆనందించాల్సిన మీరు ఈ లోకంలో లేన‌ప్పుడు ఆ ఆకాంక్ష సాకారానికి అర్ధం లేకుండా పోతుంది. అందుకే ఆత్మ‌హ‌త్య‌ల క‌న్నా బ‌తికి పోరాడ‌డమే గొప్ప‌ద‌న్న విష‌యం గుర్తించాలి.

No comments:

Post a Comment