Monday 7 March 2016

వీడియోలు ప్రసారం చేసిన చానెళ్లపై కేసు



వీడియోలు ప్రసారం చేసిన చానెళ్లపై కేసు

న్యూఢిల్లీ: జెఎన్‌యూ వివాదంలో మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రసారం చేసిన చానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ చానెళ్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసు నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం తన న్యాయవాదిని ఆదేశించింది.

ఫిబ్రవరి 9న జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశద్రోహ, జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్‌..
అసలు ఆ కార్యక్రమంలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేయలేదని, ఆ నినాదాలను వీడియోల్లో తదనంతరం మార్ఫింగ్ ద్వారా చేర్చారని తేల్చారు. ఫిబ్రవరి 9, 11 తేదీల్లో జరిగిన ఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది వీడియోలు తెరపైకి రాగా.. అందులో రెండు వీడియోలను మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తోంది. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ నినాదాలు చేస్తున్న వీడియోను కూడా మార్ఫింగ్ చేసి.. అందులో దేశద్రోహ నినాదాలు ఉన్న ఆడియోను జోడించినట్టు అనుమానిస్తున్నారు.

ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన అనంతరమే కన్హయ్యతోపాటు మరికొందరు జెనెన్‌యూ నేతలపై దేశ్రద్రోహం అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. జెఎన్‌యూ వివాదంలో కొన్ని టీవీ చానెళ్లతో ఏబీవీపీ నేతలు మాట్లాడి కథనాలు ప్రసారం చేయించినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రసారం చేసిన కథనాల వీడియోలను అందించాలని మేజిస్ట్రేట్‌ కోరినప్పటికీ ఆయా చానెళ్లు ఆ వీడియోలను సమర్పించలేదు. ఈ  నేపథ్యంలో మూడు జాతీయ చానెళ్లపై చట్టపరమైన చర్యలకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

బస్సులో నకిలీ ఐడీ కార్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్



బస్సులో నకిలీ ఐడీ కార్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్

మంచిర్యాల: నకిలీ ఐడీ కార్డుతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీకార్డుతో పవన్‌కుమార్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేవాడు. స్టాఫ్ అని చెబుతూ కండక్టర్లను నమ్మించేవాడు.
అయితే సోమవారం మంచిర్యాలలో స్పెషల్ స్క్వాడ్ అధికారులు కార్డును తనిఖీచేసి నకిలీదని గుర్తించారు. ఆర్టీసీ అధికారులు నిందితుడిని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేషన్ కు తరలించారు.

బాలకృష్ణ : ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు


 ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు
హైదరాబాద్‌: మహిళలంటే తనకు మొదట్నుంచీఅపారమైన గౌరవమని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఏ ఇంటి మహిళ అయినా.. తమ ఇంటి ఆడపడుచుగా చూడటం సంప్రదాయమన్నారు. మహిళలను తోబుట్టువులుగా చూడటం తన తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వమన్నారు.
ఇటీవలి సావిత్రి సినిమా ఆడియో విడుదల వేడుకలో సరదాగా మాట్లాడిన మాటలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించాలని కోరారు.