Wednesday 12 August 2015

కేసీఆర్ ఇంటి వద్ద ఏపీ సీఐడీ కామెడీ షో

నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్నట్లుంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆంద్రా సర్కారు వ్యవహారం. ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చేసిన తప్పుకు సిగ్గుపడకుండా రాజ్యాంగబద్ద సంస్థలను తన అడ్డగోలు వ్యవహారాలకు వాడుకుంటుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓటుకునోటు కేసులో విచారణలో భాగంగా వెల్లడయిన సమాచారం మేరకు తెలంగాణ ఏసీబీ అధికారులు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి కోసం మూడు రోజుల నుండి వెతుకుతున్నారు.
దీనిని సహించలేని బాబు ఆంద్రా సీఐడీ పోలీసులను పంపి హైదరాబాద్ లో ఈ రోజు కామెడీ షో నడిపించాడు. చంద్రబాబు ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లినందున ఆంధ్రా సీఐడీ అధికారులను కేసీఆర్ ఇంటికి పంపించాడు. అక్కడ కేటీఆర్ డ్రైవర్ సత్యనారాయణకు నోటీసు ఇవ్వాలని చూశారు. అక్కడ ఆయన లేకపోవడంతో అప్పుడు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్ళారు.
ఈ ఎపిసోడ్ అసలు విషయం ఏంటంటే ఓటుకునోటు కేసులో నిందితుడు అయిన జెరూసలెం మత్తయ్య తప్పించుకుని చంద్రబాబు సర్కారు అండతో ఆంధ్రలో అత్తగారింటి వద్ద తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. మత్తయ్య కూడా దొరికిపోతే తన భండారం ఏమవుతుందోనన్న గుబులు బాబు ఉన్నాడు. అందుకే మత్తయ్య, జిమ్మీని ఆంద్రాలో దాచేశాడని తెలుస్తోంది. ఇప్పుడు లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డిని కూడా అలాగే దాచినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు అయిన మత్తయ్య తనను బెదిరించారని చేసిన ఫిర్యాదు మీద ఇప్పుడు నోటీసులు పట్టుకుని తిరుగుతుండడం ఆశ్చర్యంగా ఉంది.
ఆ మధ్య ట్యాపింగ్ అంటూ, బాబు టేపులు ప్రసారం చేశారంటూ తెలంగాణ భవన్ కు వెళ్లి టీ న్యూస్ నోటీసులు ఇచ్చి మరో ఇద్దరు ఐపీఎస్ లు కూడా ఉన్నారంటూ ఆంధ్రా మీడియా ముందు హూంకరించిన ఏపీ సీఐడీ ఆ తరువాత చేతులు ముడుచుకుంది. అసలు ట్యాపింగ్ కానే కాదని, ..తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా టెలిగ్రాఫిక్ చట్టాన్ని ఉపయోగించుకుందని కేంద్రం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొత్త కామెడీ షో మొదలయిందన్న మాట

No comments:

Post a Comment