Friday 7 August 2015

తెలంగాణలో రాధాకృష్ణ కొత్త పార్టీ !

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కొత్త పార్టీ పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నదే నిజమే కానీ పార్టీ ఆయన పెట్టడం లేదు. ఈ రోజుకు ఆయన పత్రికలో కొత్త పార్టీ వస్తుందని రాసుకుని సంబరపడ్డాడు అంతే. ఆ మధ్య కొన్నాళ్ల క్రితం తెలంగాణలో ఓ ఉద్యమ సమితి వస్తుందని ఊదరగొట్టి టీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన చెరుకు సుధాకర్ తో పాటు మరి కొందరిని కలిపి వరంగల్ లో ర్యాలీ తీయించి ..హైదరాబాద్ లో మీటింగ్ పెట్టించి కేసీఆర్ కు పోటీగా కొత్త సంస్థ వచ్చేసిందని, రేపటి నుండి ఇక కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మత్తి పోయడమే వీరి పని అంటూ రాధాకృష్ణ స్వయంతృప్తి పొందాడు
తీరా ఆ సంస్థను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రాధాకృష్ణ కల నెరవేరడం లేదు. చంద్రబాబు కొడుకు లోకేష్ కు లేని నాయకత్వ లక్షణాలను ఆపాదించి ఎంత ఎగదోస్తే మాత్రం ఈ ఆంధ్రా మీడియా మూలంగా అతను నాయకుడయ్యాడా ? ప్రజలు ఆమోదించారా ? అంటే లేని లక్షణాలు ఆపాదిస్తే వస్తాయా ? అని జనం నవ్వి ఊరుకున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మీద లేని వ్యతిరేకతను చూపెట్టాలని, తెలంగాణ ప్రభుత్వం మీద బురద చల్లాలని రాధాకృష్ణ నిరంతరం ఓ తపస్సు చేస్తున్నాడంటే ఆశ్చర్యం లేదు
రాధాకృష్ణ కల నెరవేరుస్తాడు అనుకున్న రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసులో చిక్కి ఇంట్లో ఉన్నాడు. ఆ సంస్థ ..ఈ సంస్థ అని ఎంతచేసినా లాభంలేకపోవడంతో ఈ రోజు ఏకంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెడుతున్నాడని వార్త రాసేశాడు. ఢిల్లీలో ఉన్న యోగేంద్ర యాదవ్ కు కోదండరాం కు లింకు పెట్టి కొత్త పార్టీకి రంగం సిద్దం చేశాడు. జంతర్‌ మంతర్‌లో భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా స్వరాజ్‌ అభియాన్‌ కార్యక్రమానికి వెళ్తున్నది కొత్త పార్టీ కోసమే అంటూ కనిపెట్టాడు రాధాకృష్ణ
అంతే కాదు ..తెలంగాణ విభజన జరిగినా ఉద్యోగులను విభజించకుండా , పలు శాఖలను విభజించకుండా ..తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకుండా వేధిస్తున్న నేపథ్యంలో ఇటీవల న్యాయవాదుల రౌండ్ టేబుల్ సమావేశంలో సంపూర్ణ తెలంగాణ కొరకు మరో ఉద్యమం చేపడతామని కోదండరాం ప్రకటిస్తే దానిని ఆ రోజు పెద్ద వార్తగా రాయని రాధాకృష్ణ ఈ రోజు తన ఆత్మతృప్తి కోసం రాసుకున్న వార్తకు ఆధారంగా చూపెట్టుకున్నాడు. పూటకో అబద్దంతో పూట గడుపుకుంటున్న రాధాకృష్ణ వేదన అంతులేనికథలా మిగులుతుందని అనిపిస్తుంది.

No comments:

Post a Comment