Monday 10 August 2015

మూలిగే నక్కపై ముంజకాయ పడ్డట్టుంది .....

మూలిగే నక్కపై ముంజకాయ పడ్డట్టుంది .....
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు మూలిగే నక్కపై ముంజకాయ పడినట్టుంది.ఆయన ఏది చేసినా అది అతని మెడకేచుట్టుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు వల్ల ఆయన వ్యక్తిత్వంపై మచ్చ పడింది.
ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు హస్తం ఉందంటూ తలెత్తిన అభియోగాలు ఆయన ప్రతిష్టను దెబ్బ తీసిన మాటను కాదనలేం. ఇకపోతే, గతనెల 14న రాజమండ్రిలో మహావైభవంగా గోదావరి పుష్కరాలు ప్రారంభమైన రోజునే తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పి నాలుగు వారాలు గడుస్తున్నా, ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. అదలా ఉండగానే, రుషితేశ్వరి సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్ట్ కోర్సు మొదటి ఏడాది చదువుతున్న రుషితేశ్వరి ర్యాగింగ్ భూతానికి బలైంది. 

సంఘటన చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసిందనే చెప్పాలి. విపక్షాల ఆందోళనతో మెట్టుదిగిన ప్రభుత్వం కమిటీని నియమించింది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చింది.ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు దృఢంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. ప్రత్యేక హోదా కోసం మునికోటి అనే కాంగ్రెసు కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సమస్య తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబును సమస్యలు పట్టిపీడిస్తున్నా ప్రతిపక్షాలు వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఇది కొంత వరకు చంద్రబాబుకు ఊరట కలిగించే విషయం. అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కడం చంద్రబాబుకు పరీక్షనే.

No comments:

Post a Comment